తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: అన్నీ హైదరాబాద్‌లోనే
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 21 నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటకే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా టెస్టులు పెంచాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తన కరోనా బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 14 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ నగర పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ జేఎన్.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సానిటైజ్ చేసుకోవడం లాంటివి చేయాలని సూచించింది.అనవసరమైన ప్రయాణాలకు ఉండాలని పౌరులను అభ్యర్థించింది. జ్వరం, దగ్గు, జలుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, తలనొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది.
కాగా, కేరళ, గోవాతోపాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. దేశంలో కొత్త వేరియంట్ కేసులు 21 నమోదు కావడం గమనార్హం. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. కరోనా వ్యాపిస్తున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications