గ్రాండ్ ఫినాలె నేడే.. ఆ అదృష్టవంతురాలు ఎవరో..?
Miss world 2025: మిస్ వరల్డ్ కంటెస్ట్.. చివరిదశకు చేరుకుంది. ఇది 72వ ఎడిషన్. దాదాపుగా నెలరోజుల పాటు సాగిన ఈ పోటీలకు నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రమే గ్రాండ్ ఫినాలె. హైటెక్స్.. దీనికి వేదిక. మిస్ వరల్డ్ కిరీటం కోసం మొత్తం 108 దేశాలు పోటీపడ్డాయి. వారిలో 40 మంది చివరి రౌండ్ కు చేరుకున్నారు. ఫైనల్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వివాదాస్పద పరిస్థితుల మధ్య మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తప్పుకోవడంతో ఈ సంఖ్య తగ్గింది. ఫైనల్ రౌండ్ కు ఎంపికైన వారిలో మిస్ ఇండియా నందిని గుప్తా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అందరి దృష్టీ ఆమెపైనే నిలిచింది. టాప్ 5లో రాగలుగుతారా? లేదా అనే ఆసక్తి నెలకొంది.

మిస్ వరల్డ్ టైటిల్ ఖరారు చేయడానికి 24 మందితో కూడిన జ్యూరీ ఏర్పాటైంది. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ఫిలాంథ్రోపిస్ట్ సుధారెడ్డి, 2014 మిస్ వరల్డ్ డాక్టర్ కెరీనా టర్రెల్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ జూలియా మోర్లె.. ఈ జ్యూరీలో సభ్యులుగా ఎంపికయ్యారు. విన్నర్ కు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని ధరింపజేస్తారు.
2016 మిస్ వరల్డ్.. స్టెఫానీ డెల్వాలె, సచిన్ కుంభర్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తారు. ఫైనల్స్ ఆరంభం కావడానికి ముందు- బాలీవుడ్ సెలెబ్రెటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లార్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
ఇదే వేదికపై.. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకోనున్నారు సోను సూద్. కోవిడ్ విస్తరించినప్పుడు ఆయన సేవలను గుర్తుగా ఈ అవార్డును ఆయనకు అందజేయనుంది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
హైదరాబాద్‌కు చెందిన సుధా రెడ్డికీ అరుదైన గౌరవం లభించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు తొలి గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. సామాజిక రంగం, మహిళా సాధికారత, సమాన హక్కుల కోసం ఆమె సాగిస్తోన్న పోరాటాలను దృష్టిలో ఉంచుకుని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛారిటబుల్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యూటీ విత్ ఎ పర్పస్ కు గ్లోబల్ అంబాసిడర్ గా అపాయింట్ చేసినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications