స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన 80 శాతం మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu: తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధిలో కొత్త దిశను చూపుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యూనివర్సిటీలో శిక్షణ పొందిన వారిలో 80 శాతం మందికి ఉద్యోగావకాశాలు లభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కళాశాలలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్/స్కిల్ అండ్ లోన్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను 'స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబల్'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
యువత ప్రతిభే తెలంగాణకు అతి పెద్ద ఆస్తి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అయితే, చాలా మందిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు ఉంటడం లేదన్నారు. పరిశ్రమల అవసరాలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.అందర్నీ కలుపుకొని పోయే తమ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలోనూ పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నట్టు వెల్లడించారు. వారి సహకారంతోనే స్కిల్ యూనివర్సిటీలో కోర్సులకు రూపకల్పన చేస్తున్నామని, ఇక్కడ శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని ప్రకటించారు.

తెలంగాణ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాల్సిన అవసరాన్ని శ్రీధర్ బాబు నొక్కిచెప్పారు. టెక్నాలజీ సాయంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ప్రయత్నిచాలని, ఓటమికి నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలని, అప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారని యువతకు సూచించారు.
కార్యక్రమం సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications