విషాదం: పెళ్లికి బయలుదేరి అనంత లోకాలకు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారానికి చెందిన పిట్టల మదార్, పెంటమ్మ దంపతుల కొడుకులు దశరథ (50), యాదయ్య (48), చంద్రయ్య (46) ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని బంధువుల ఇంటికి పెండ్లి వేడుకలకు హాజరయ్యేందుకు స్కూటర్‌పై బయలుదేరారు.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేటలోని దండుమైలారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీనారాయణ(50), మహదేవ్ (46), సహదేవ్ (40), గోవింద్(45)లు ఆదివారం కడ్తాల్‌లో ఒక వివాద విషయమై చర్చించేందుకు వెళ్లి ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది.

ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న కృష్ణయ్యను జిల్లా కేంద్రానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటనస్థలానికి చేరుకొని మృతుల వివరాలు తెలుసుకున్నారు.
మరో ప్రమాదంలో వరంగల్ జిల్లా ములుగు మండలం వెంకటాపురానికి చెందిన గడ్డమీది సంతోష్ (25) అతని బంధువు ఇదే మండలం నారాయణపురానికి చెందిన హర్షం రాజబాబు (25) వారంరోజుల క్రితం ఖమ్మం జిల్లా పినపాకలోని సోదరి ఇంటికి వచ్చారు.
ఆదివారం సంతోష్ బావ శ్రీనుకు చెందిన బైక్‌ను తీసుకుని వీరిద్దరూ కరకగూడెం వైపు వెళ్లి తిరిగి వస్తూ తోగ్గూడెం, గోవిందాపురం మధ్య గల చినవాగు బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి లోయలో పడ్డారు. బండరాళ్లు తలలకు తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications