సీఏ విద్యార్థిని ఆత్మహత్య: ఆమె గదిలోనే ఉంటున్న స్నేహితుడిపైనే అనుమానం
హైదరాబాద్: సీఏ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అయితే, ఆమె ఓ స్నేహితుడితో గత కొంతకాలంగా ఉంటోంది. అతనిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చల్మాయికి చెందిన వీరస్వామి కుమారుడు రంజిత్ గౌడ్(25) నగరంలో సీఏ చదువుతున్నాడు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీనివాసులు కుమార్తు సుప్రియ(22) కూడా సీఏలో చేరింది.
శ్రీ మేధా ఇనిస్టిట్యూట్‌లో రంజిత్, సుప్రియ స్నేహితులుగా మారారు. దీంతో ఇద్దరూ కలిసి సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీలోని రోడ్ నెంబర్ 6లో గల గోకుల్ రెసిడెన్సీలో 103 ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. కాగా, చుట్టుపక్కల వారు వీరిని భార్యాభర్తలునే అనుకుంటున్నారు.

అయితే, అకస్మాత్తుగా సుప్రియ సోమవారం బెడ్ రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని రంజిత్ పోలీసులకు తెలిపాడు.
సుప్రియ రాసినట్లుగా పేర్కొంటున్న ఓ సుసైడ్ నోట్ లభించినప్పటికీ అందులో సంతకం చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, కూతురు మృతి విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురు దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుందని అనుకున్నామని, ఇలా జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కూతురు ఆత్మహత్యకు రంజిత్ కారణమని సుప్రియ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంజిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జేఈఈ మెయిన్స్(ఐఐటీ ప్రవేశ పరీక్ష) కీని పరిశీలించిన ఓ విద్యార్థి తక్కువ మార్కులొస్తున్నాయని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదేందర్ కథనం ప్రకారం.. రాజమండ్రి వీఆర్ పురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎం సత్యనారాయణ ప్రసాద్ కుమారుడు వెంకటసాయిరాం సందీప్ రాయదుర్గం టింబర్ లేక్ కాలనీలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
అదే కళాశాల హాస్టల్‌లోని రెండో అంతస్తులోని ఒక గదిలో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల జేఈఈ(ఐఐటీ ప్రవేశ పరీక్ష) మెయిన్స్ రాశాడు. సోమవారం ఆ పరీక్ష కీ వెలువడింది. దాన్ని పరిశీలించిన సందీప్ తనకు తక్కువ మార్కులొస్తున్నాయని మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications