బావిలోకి దూసుకెళ్లిన కారు: నలుగురి మృతి, ముగ్గురికి గాయాలు
వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కేసముంద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో బయటపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు. కేసముద్రం బైపాస్ రోడ్డులో మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా కారు అదుపుతప్పి సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్ తోపాటు ఇద్దరు కారులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మహిళలను వెలికి తీయగా ఒకరు మృతి చెందారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బావిలో పడిన కారును జేసీబీ సాయంతో బయటకు తీయగా కారులో చిక్కుకున్న రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు మహబూబాబాద్‌కు చెందిన తల్లీకుమారులు లలిత(40), సురేష్(20), టేకులపల్లికి చెందిన అశాలి(32), భద్రు(40)గా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై కేసముంద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications