హైడ్రా బాధితులకు బాసటగా
HYDRAA: హైదరాబాద్‌లో చెరువులు, కుంటల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్.. హైడ్రా పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైడ్రా కూల్చివేతల నుంచి తమను ఆదుకోవాలంటూ మూసీ నిర్వాసితులు భారత్ రాష్ట్ర సమితి నాయకులను ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, తుమ్మిడికుంట వంటి చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు హైడ్రా అధికారులు.

ఈ కూల్చివేతల వ్యవహారంలో దిగువ మధ్య తరగతి కుటుంబీకులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మూసీ నది పరీవాహక ప్రాంతంలో కూడా కూల్చివేతలను చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ఇదివరకే రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ సైతం పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలో- ఇప్పటికే మూసీ నిర్వాసితులు లంగర్ హౌస్ వద్ద భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టడం, బీఆర్ఎస్‌ను ఆశ్రయించడం తెలిసిందే. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. కన్నీటితో తమ ఆవేదను వారికి వివరించారు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన ప్రత్యేక బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, గుంగల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి సహా గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో వాళ్లు బాధితులను కలిశారు.

మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైడ్రా కూల్చివేతలు పక్కదారి పట్టాయని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి కుటుంబీకులు తాము కూడబెట్టుకున్న సొమ్ముతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం, వారిని నిరాశ్రయులు చేయడం సరికాదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు.
ఎలాంటి సర్వేలకు కూడా నిర్వాసితులు అంగీకరించవద్దని, కొత్తవారినెవరినీ తమ కాలనీల్లోకి రానివ్వొద్దని కోరారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో హెచ్ఎండీఏ ఎలా లేఅవుట్లు వేసిందంటూ ప్రశ్నించారు. అనంతరం వారందరూ మూసీ పరీవాహక కాలనీల్లో పర్యటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైడ్రా పనితీరునూ తప్పు పట్టారు. పేదల పొట్ట కొట్టవద్దంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications