స్విగ్గీలో 6 లక్షల ఇడ్లీలు ఆర్డర్ చేసిన హైదరాబాదీ: 1,633 బిర్యానీలు తిన్న మరో ఫుడీ
Hyderabad Biryani: హైదరాబాదీలు సహజంగానే భోజన ప్రియులు. నోరూరించే ఎలాంటి వంటకాలనైనా స్వాహా చేసేస్తారు. ఇక బిర్యానీ పేరెత్తితే దాన్ని రుచి చూడందే వదల్లేరు. మాంసాహారం అంటే మరీనూ. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ..చివరికి ఎగ్ బిర్యానీని కూడా ఇష్టంగా తింటారు.
ఇప్పుడదే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గికి లాభాల పంట పండించింది. హోటల్‌కో, రెస్టారెంట్లకో వెళ్లనక్కర్లేకుండా ఇంటి వద్దకే స్విగ్గి ద్వారా ఇంటి వద్దకే తమకు నచ్చిన ఫుడ్‌ను తెచ్చుకోవడం వైపే హైదరాబాదీ ఫుడీస్ మొగ్గు చూపారు. ఈ ఏడాదిలో హైదరాబాద్ నుంచి భారీగా ఆర్డర్లు అందాయి స్విగ్గీకి.

హైదరాబాద్‌కు చెందిన ఒకే ఒక్క యూజర్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా ఆరు లక్షలకు పైగా ఇడ్లీలను స్విగ్గి ద్వారా తెప్పించుకుని తిన్నాడు. దీన్ని బట్టి చూస్తే అతనికి ఇడ్లీలు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇడ్లీలంటే చాలా మంది పెద్దగా ఇష్టపడరు..నూనె, ఇతర మసాలా దినుసులు ఏవీ ఉండవు కాబట్టి.
మరికొందరు ఇడ్లీలను టాబ్లెట్లతో పోలుస్తుంటారు. అనారోగ్యానికి గురైనప్పుడో లేక జ్వరం బారిన పడ్డప్పుడో- తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీలనే తినమని చెబుతుంటారు. ఈ యూజర్ మాత్రం ఈ ఒక్క ఏడాదిలోనే ఆరు లక్షలకు పైగా ఇడ్లీలను తెప్పించుకున్నాడంటే దానిపై అతనికి ఉన్న ఇష్టం చెప్పనక్కర్లేదు.
ఇక- హైదరాబాద్‌కే చెందిన మరో ఫుడీ ఈ ఒక్క ఏడాదిలోనే 1,633 బిర్యానీలను స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశాడు. అంటే- సంవత్సరానికి 365 రోజులను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే తెప్పించుకున్నట్టయింది. మరి ఇన్ని బిర్యానీలను ఏం చేశాడనేది మన ఊహకే వదిలేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడు పోయిన ఆహార పదార్థాల్లో బిర్యానీ కూడా ఒకటి. ఇందులో ప్రతి ఆరవ బిర్యాని కూడా హైదరాబాద్ నుంచే ఆర్డర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సగటున ప్రతి సెకెన్‌కు రెండున్నర బిర్యానీల ఆర్డర్లు అందాయి.
ముంబైకి చెందిన మరో వినియోగదారుడు ఈ ఏడాదిలో ఇప్పటివరకు స్విగ్గి ద్వారా 42.3 లక్షల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాడు. మరో యూజర్ ఒకే రోజు 207 పిజ్జాలను ఆర్డర్ చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన వేలంటైన్స్ డే నాడు ప్రతి నిమిషానికీ 271 కేకుల ఆర్డర్లు స్విగ్గికి అందాయి.












Click it and Unblock the Notifications