బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్/నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే పీయూసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అడ్మినిస్ట్రేటివ్ భవనం బాత్రూంలో అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను.. వెంటనే నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మంగళవారం ఉదయం ఫిజిక్స్ పరీక్ష రాసిన దీపిక.. పరిపాలన భవనం వద్దకు వచ్చి తనకు మానసికంగా ఆందోళనగా ఉందని చెప్పింది. అధ్యాపకులు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బాత్రూంకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చి సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా.. బాత్రూంలో ఎగ్జాస్టర్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.

కొన ఊపిరితో ఉన్న దీపికను వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఇప్పటికే పలు సమస్యలతో వార్తల్లో నిలిచిన బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం. కాగా, దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్. కాలేజీ భవనంపైనుంచి పడి విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగర శివారు బాచుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వంశిత అనే విద్యార్థిని కాలేజీ భవనం ఐదో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన రాగుల వంశిత వారం రోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్‌లో చేరింది. అయితే, విద్యార్థిని మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలేజీ భవనం వెనుకవైపు విద్యార్థిని అనుమానాస్పద స్తితిలో మంగళవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై కాలేజీ యాజమాన్యం బాచుపల్లి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వంశిత భవనంపైనుంచి దూకేసిందా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వంశిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వంశితది ఆత్మహత్యనా? హత్యనా? ప్రమాదమా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications