సంక్రాంతికి రైల్వే శుభవార్త.. 600 ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ అంటే అతి పెద్ద పండుగ. సంక్రాంతి పండుగకు చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్లి పండుగను జరుపుకుంటారు. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, చదువు కోసం దూరప్రాంతాల్లో ఉన్నవాళ్లంతా సొంత ఊర్లకు తరలి వెళ్తారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ రద్దీగా మారుతాయి.
అప్పుడే పెరిగిన బస్సుల రష్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అందుబాటులో ఉంది. దీంతో ఇక పండుగలకు వెళ్లే వారి హడావుడి మామూలుగా లేదు. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ రోజుల కంటే, ప్రస్తుతం పండుగల వేళ ఇప్పటికే ఊర్లకు వెళ్లాలనుకునే వారికి బస్సులలో సీట్లు దొరకక ఇబ్బంది పెరిగిపోతుంది. ఇప్పటికే దూరప్రాంతాలకు వెళ్లే వారికి బస్సుల టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి.

సంక్రాంతికి 600 ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధంగా ఉన్నాం : సీపీఆర్వో శ్రీధర్
దీంతో బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునేవారు డబుల్ ధరలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.సంక్రాంతికి 600 ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే శాఖ వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
600 వరకు ప్రత్యేక రైళ్లను నడపడానికి తాము సిద్ధం
సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పైన ఎస్ సి ఆర్ సిపిఆర్ఓ శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరమైతే జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతికి ఇంకా 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు రైళ్ల టికెట్లు అన్నీ బుక్ అయిపోతున్నాయి.
ఈ స్టేషన్ల నుండి రైళ్ళ రాకపోకలు
ప్రస్తుత రద్దీ నేపథ్యంలో సంక్రాంతికి 600 ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి వంటి ముఖ్యమైన స్టేషన్ల నుండి బయలుదేరుతాయి అని పేర్కొన్నారు. సిపిఆర్ఓ శ్రీధర్. ఇటు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, గుంటూరు వంటి మార్గాలలో కూడా ఇప్పటి నుంచే భయంకరమైన పండుగ రద్దీ కొనసాగుతుంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళ ద్వారా 30లక్షల మందికి అవకాశం
ఈ రద్దీని గమనించిన అధికారులు ప్రత్యేక రైళ్లను జనవరి 24వ తేదీ వరకు నడపడానికి ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుతం 400లకు పైగా ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఆ సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళ ద్వారా 30లక్షల మందికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఈ ప్రత్యేక రైళ్లకు సాధారణ రైలు చార్జీల కంటే అదనపు చార్జీలు వర్తిస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications