ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదు: రేవంత్ రెడ్డి దూకుడు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం ఎన్జీఆర్ఐ నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును తాము పునః ప్రారంభించామని, అసంపూర్తిగా మిగిలిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకుంటోన్నామని అన్నారు.

ఎన్జీఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1,000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాళ్లు, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుందని వివరించారు. ఈ ప్రాంతం అంతా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటం వల్ల పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టని, 44 కిలో మీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదుని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఎల్‌బీసీతో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదని వ్యాఖ్యానించారు.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని చెప్పారని. ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేమని, ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications