'ముస్లిం అస్తిత్వం' : సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : సాహిత్యం సమాజ స్థితి గతులను నిర్దేశిస్తుంది. భవిష్యత్ పరిణామాలను అంతర్గతంగా చర్చిస్తూనే వాస్తవ పరిస్థితులను సమాజం ముందు ఏకరువు పెడుతుంది. ముఖ్యంగా మెజారిటీ-మైనారిటీ అనే రెండు వేర్వేరు వైరుధ్యాల మధ్య అస్థిత్వ వాదానికి సంబంధించిన సాహిత్య ప్రస్తావన వచ్చినప్పుడు.. అది భిన్నాభిప్రాయాలకు తావిచ్చే వేదికగా మారుతుంది.

నేపథ్యం నుంచి పుట్టుకొచ్చే అస్థిత్వ వాదం ముస్లిం సాహితీకారులకు మిగతా అస్థిత్వ వాదాల్లో ఉన్నంత వెసులుబాటును కల్పించలేదంటూ ప్రముఖ రచయిత, యాక్టివిస్ట్ స్కై బాబా లేవనెత్తిన చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడో హాట్ టాపిక్. "చేటు చేసే ముస్లిం వాదుల మౌనం" అంటూ ఆయన రాసిన వ్యాసం ఇటు సాహిత్య పరంగాను, అటు సామాజిక పరంగాను ఓ అర్థవంతమైన చర్చకు ఆస్కారం కల్పించింది.

ప్రస్తుత దేశీ ఇస్లాం అస్థిత్వానికి వలస వాదంగా పరిణమించిన అరబిక్ ఇస్లాం గురించి ఆవేదన చెందుతూ.. తమదైన విశ్వాసాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నది ఆ వ్యాసం ద్వారా స్కై వెలిబుచ్చిన అభిప్రాయం. ప్రగతీశీలురుగా ఉండాల్సిన సాహితీకారులు మత మౌఢ్యాలను అంటించుకోవడం కూడా ఒక్క ముస్లిం వర్గాల్లోనే చోటు చేసుకుందని వ్యాసంలో స్కై పేర్కొన్నారు.

అయితే ఈ వ్యాసంపై సోషల్ మీడియాలో రక రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అందులో కొందరు ప్రముఖల అభిప్రాయాలు.. స్లైడ్స్

హెచ్చార్కే : 'ఒక ధిక్కార స్వరానికి మద్దతుగా'

హెచ్చార్కే : 'ఒక ధిక్కార స్వరానికి మద్దతుగా'

హిందూ మతోన్మాదులు, తాము న్యూమరస్ గా వున్న ఒకే ఒక్క దేశంలో (ఇండియాలో) తమ ప్రతాపం చూపిస్తున్నారు. అదే దేశంలో హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకించే వారు ప్రాణాలకు తెగించి గళం విప్పుతున్నారు. మరి ముస్లిం మతోన్మాదులు వాళ్ళు న్యూమరస్ గా వున్న దేశాల్లో... ఒకటి కాదు చాల దేశాల్లో... ప్రతాపం చూపిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా గళాలు వినిపించకపోగా, ఎడనెడ, ఆ మతవాదానికి సమర్థనలు వినిపిస్తున్నాయి.

హెచ్చార్కే తో వ్యతిరేకించిన వాహెద్

హెచ్చార్కే తో వ్యతిరేకించిన వాహెద్

హెచ్చార్కే గారి దృష్టిలో మతోన్మాదులకు వ్యతిరేకంగా గళాలు విప్పే ప్రజాస్వామిక తత్వం హిందూమతానికి మతపరంగానే ఉండడం వల్లనూ, హిందూ మతస్తులు ఆ తత్వాన్ని తమలో నింపుకుని ఉండడం వల్లనూ ఇక్కడ మతోన్మాదానికి వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయనియునూ, కానీ...కానీ.. ముస్లిం మతంలో మతోన్మాదానికి వ్యతిరేక గళాలను అణిచివేసే తత్వం స్వతహాగా అందులోనే ఉండడం వల్లను ముస్లిం మతస్తులు స్వతహాగానే మతోన్మాదాన్ని సమర్థిస్తారనియును ఆయన మాటలకు భావముగా తోస్తున్నది.

హెచ్చార్కేతో విభేదించిన ఖాజా

హెచ్చార్కేతో విభేదించిన ఖాజా

మతం కారణంగా ఈ దేశంలో వివక్షకు గురవుతున్న నా మతస్తుల నుంచి నన్ను నేను వేరు చేసుకోవడం ద్వారా నా వెనకబడిన జాతిని నేను ఒంటరిగా వదిలేయలేను... బహుశా నా మతస్తులు జ్ఞానం చేతనో అజ్ఞానం చేతనో అలా వున్నా నేను వారి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని కూడా ప్రేమిస్తాను.... వారి అజ్ఞానానికి ఈ సమాజమే కారణం అన్నది నా బలమైన అభిప్రాయం. అయితే సంస్కరించుకోవలసిన విషయాల పట్ల, కాలం చెల్లిన అభిప్రాయలు, మూర్ఖ విశ్వాసాల పట్ల నేను ముస్లిం సమాజంతో ఘర్షణ పడతాను.

చింతపల్లి అనంతు

చింతపల్లి అనంతు

ఈ నేలలో ముస్లింలు తమ అస్తిత్వ నిరూపణకూ, అనుమానాలకూ, అవమానాలకూ, అనవసర నిర్బంధాలకూ గురికాబడుతున్నది ప్రధాన హిందూ మూకలనుంచే.
డికాస్టిఫై అయ్యామనుకున్నలేదా మరియూ మతం మత్తు మందు అనుకుని అదే మత్తు మందు వేసుకుని పడుకుంటున్న ఫాల్స్ కమ్యూనిస్టులనుంచి ఇప్పుడు దాడులు కూడా మొదలు కావడం ముస్లింలు (చేసుకున్న) చేయవలసి వున్న అదనపు దౌర్భాగ్యపు అనవసర పోరాటం మాత్రమే.
అమీన్!

యజ్దాని డాని

యజ్దాని డాని

వ్యాసంలో శీర్షిక దగ్గర నుండి చివరి పదం వరకు స్కైబాబా అజ్ఞానం, అమాయికత్వం, అబధ్ధాలే కనిపించాయి. అసహనం - మతసామరస్యం, ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటుల గురించి అనేక సిధ్ధాంత వ్యాసాలు వచ్చాయి. వాటి ముందు ఇవ్వాల్టి స్కైబాబా వ్యాసం చిట్టెలుక కూడా కాదు. స్కైబాబాకు ఒక సిధ్ధాంత వ్యాసం రాసే స్తోమత ఎన్నడూ లేదు. అది చేతకాకపోయినా ఫరవాలేదు.

షేక్ పీర్ల మహమ్మూద్

షేక్ పీర్ల మహమ్మూద్

మన దేశ భౌతిక పరిస్థితులలో ఇమడని ఆలోచనా విధానాన్ని ముస్లీంల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల ముస్లీం రచయితలు ఖచ్చితంగా ఓ క్రియాశీలక పాత్ర నిర్వహించాలని కోరుకోవడం మంచి విషయం. ఈ సందర్భంలో ఛాందసత్వం వల్ల ముఖ్యంగా ముస్లీం యువత ఎంత క్రియారాహిత్యంగా మారిపోతున్నారో అర్థం చేసుకోమనీ ఇది మన దేశ ముస్లీం లకు ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించడానికే ఆ వ్యాసం రాశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its a social media debate over Sky Babas article which he wrote in Sakshi daily over the issue of muslim literary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి