గొంతులో ఇడ్లి ఇరుక్కుని చిన్నారి మృతి: తల్లికి మత్తు మందిచ్చి శిశువు అపహరణ
మహబూబ్‌నగర్/నల్గొండ: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ చిన్నారి తల్లిదండ్రులను విడిచి తీరని లోకాలకు చేరుకుంది. ఆమె మరణానికి తల్లి పెట్టిన ఇడ్లియే కారణం కావడం విచారకరం.
జిల్లాలోని ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విషాదంలో ముంచివేసింది. వెంకటయ్య, పద్మ దంపతులకు ఐదు నెలల పృథ్వీరాజ్ సంతానం.
బుధవారం ఉదయం చిన్నారికి పద్మ ఇడ్లీ తినిపించే ప్రయత్నం చేసింది. ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టగా గొంతులో ఇరుక్కుపోవడంతో పసివాడు విలవిల్లాడిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తల్లికి మత్తు మందు ఇచ్చి కూతురు అపహరణ
నల్గొండ జిల్లాలో ఇద్దరు మహిళా దొంగలు ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడటంతో పాటు ఓ పాపను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళుతున్న బాధిత మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె దగ్గరున్న నగల బ్యాగు తోపాటు ఆమె కుమార్తెను అపహరించారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉండే సంతోష(23) వినాయక చవితి సందర్భంగా తన కుమార్తెతో కలసి బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి బయలుదేరింది. ఉప్పల్‌లో భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది.
కాగా, ఆమె 8తులాల బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని తన వెంట తీసుకెళ్తోంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, బీబీనగర్‌లో సంతోషకు తెలివి వచ్చింది.
చూసేసరికి చేతిలో బ్యాగు లేదు, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, తన కుమార్తె కనిపించలేదు. బస్సు దిగి బాధితురాలు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎవరో మత్తు మందు చల్లి బంగారు నగలు, తన కుమార్తెను అపహరించారని ఫిర్యాదులో పేర్కొంది.












Click it and Unblock the Notifications