చైన్ స్నాచర్ ఘాతుకం: తాళి చోరీకి ప్రయత్నించి, మహిళ చేతిలోని పాప ప్రాణం తీశాడు
హైదరాబాద్: చైన్ స్నాచర్లు దారుణాలకు తెగబడుతున్నారు. గత రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేశారు చైన్ స్నాచర్లు. ఈ ఘటన మరువక ముందే జనగామ జిల్లా కేంద్రంలో మరో దారుణానికి పాల్పడ్డారు.
జనగామ అంబేడ్కర్ నగర్‌లో రోడ్డుపై వెళ్తున్న ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి చైన్ స్నాచర్ ప్రయత్నించాడు. గొలుసు చోరీని అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న పాపను తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయాడు ఆ దుండగుడు.

ఆ దుర్మార్గుడి దుశ్చర్యకు నిశ్చేష్టురాలైన ప్రసన్న తేరుకుని.. పాపను రక్షించడానికి ప్రయత్నించి విఫలమైంది. స్థానికుల సాయంతో నీటిసంపులో నుంచి పాప తేజస్వినిని బయటకు తీసింది. అప్పటికే ఆ ఏడాది పాప మరణించింది. అయినా ఆశ కోల్పోని ఆ తల్లి వెంటనే జనగామ ఎంసీహెచ్‌కు తరలించింది. పాపను పరీక్షించిన వైద్యులు పాప మరణించినట్లు ధ్రువీకరించారు.
తన చిట్టితల్లి మృతి చెందిందని తెలిసిన ప్రసన్న కన్నీరుమున్నీరుగా విలపించింది. మంగళసూత్రం కోసం చూసుకుంటే.. తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని రోదించింది.అనంతరం మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
దారుణానికి చైన్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన ప్రాంతంలో సీసీ కెమారాలున్నాయా? ఉంటే ఫుటేజీ సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications