Aadhaar: ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు..
తెలంగాణలోని ఆధార్ సెంటర్లు, మీసేవ సెంటర్ల వద్ద జాతర కొనసాగుతోంది. గురువారం నుంచి ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో జనాలు దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆధార్ లో అడ్రస్ అప్డేట్, ఇంటి పేరు మార్పు కోసం ఆధార్ సెంటర్ల వద్ద జనాలు బారులు తీరారు. గురువారం ఉదయం నుంచే ఆధార్ సెంటర్ల వద్ద క్యూలైన్లు కట్టారు. అలాగే కొన్ని ఆధార్ కార్డులు ఏపీ పేరుతో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల పేరుతో ఉన్నాయి.
దీంతో ఆధార్ సవరించుకోవడానికి ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు. అలాగే అరుగ్యారెంటీల కోసం ప్రభుత్వం ఒక ఫామ్ ను విడుదల చేసింది. ఈ ఫామ్ కోసం జనాలు మీసేవ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఛాన్స్ దొరికిందన్నట్లు మీసేవ సెంటర్ నిర్వాహకులు ఫామ్ కు రూ.10 నుంచి రూ.15 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ ముందు పలు గ్రామాల నుండి మహిళలు చిన్న పిల్లలతో కలిసి తెల్లవారుజాము క్యూలైన్లు కట్టారు.

ఒక్కో రోజు సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డా తమ వరకు రావడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచి తమ బాధలను తీర్చాలని కోరుకుంటున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రం వద్ద జనం తాకిడి పెరిగింది. ఆధార్ కార్డులలో చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం స్కీమ్స్ దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు కీలకం కావడంతో ఆధార్ సెంటర్ల వద్ద రద్దీ కొనసాగుతోంది.
కొత్త రేషన్ కార్డుల కోసం, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు అవసరం కావడంతో చాలా మంది ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.












Click it and Unblock the Notifications