నెల కిందే వివాహం: భర్తను వదిలి.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, పెద్దలు మాత్రం వారి పెళ్లికి అంగీకరించలేదు. అంతేగాక, ఆ ప్రేమ జంటను విడదీస్తూ.. యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో వివాహం చేశారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న యువతి.. ప్రియుడితో కలిసి బతికేందుకు అవకాశం లేదని భావించి అతనితోపాటే బలవన్మరణానికి పాల్పడింది.

ఇంటర్మీడియట్ నుంచి ప్రేమ..
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లి శివారులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్(21), సారా మీనా(21) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

కులాలు వేరు కావడంతో.. యువతికి మరొకరితో పెళ్లి..
ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి, కులాలు వేరుకావడంతో ఆ ప్రేమ జంటను విడదీశారు. కలవొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన యువకుడితో మీనాకు గత నెలలో వివాహం జరిపించారు. వివాహం జరిగినప్పటికీ.. కార్తీక్, మీనా ప్రేమ వ్యవహారం కొనసాగించారు.

ప్రియుడిని కలిసేందుకు అత్తింట్లోంచి..
మంగళవారం బంధువు వివాహానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు కార్తీక్. అత్తగారింట్లో ఉన్న మీనా కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటికి వెళ్లిపోయింది. సాయంత్రమైనా కోడలు ఇంటికి రాకపోవడంతో మీనా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు అత్తింటివారు. కార్తీక్ కూడా ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు కూడా గాలింపు చేపట్టారు.

ప్రియుడితో కలిసి బలవన్మరణం..
కాగా, బుధవారం ఉదయం పూలపల్లి సమీపంలో మీనా, కార్తీక్‌లు ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్లు గ్రామస్తులు గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరుకుటుంబాలవారు వచ్చి విగత జీవులైన తమ కొడుకు, కూతురులను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఇద్దరి బలవన్మరణంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications