నల్గొండలో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..ఇద్దరిపరిస్థితి విషమం..
నల్గొండలో ఘోరబస్సు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద నిన్న (శనివారం) అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో ఘోర ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు హైదారబాద్ నుంచి చైన్నె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిటనట్లు తెలుస్తోంది. మర్రిగూడ బైపాస్ వద్ద వంతెన వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో అటుగా వెళ్తున్న బస్సు రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బోల్తా పడింది. ఈ బస్సులో సుమారు 35 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక జనరల్ ఆసుపత్రికి తరలించింది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఒక్కసారిగా ఉన్నట్లుండి బస్సు పల్టీ కొట్టడంతో ప్రయాణికులంతా బయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడంతో అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు.












Click it and Unblock the Notifications