కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
హైదరాబాద్: కొలువు కోసం ఎంత ఆశగా వచ్చిన నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి.. ఆ తర్వాత కొంత కాలానికే బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. దీంతో వందలాది మంది టెక్కీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తమను మోసం చేసిన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన నగరంలోని మదాపూర్ లో చోటు చేసుకుంది.
అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ దాదాపు 600 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ. 1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లుగా నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది.

దాదాపు రూ. 10 కోట్లకుపైగా వసూలు చేసిన ఆ కంపెనీ కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుల హస్తం ఉందని బాధితులు చెబుతున్నారు.
కాగా, ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కూడా కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. కంపెనీ ఉన్నతస్థాయి ఉద్యోగులు, కంపెనీ యజమాని దొరికితేనే పూర్తి విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదన్నారు. కంపెనీ యజమానితోపాటు మేనేజర్‌కు ఫోన్ చేస్తే సమాధానం రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications