విద్యార్థిని ఆత్మహత్య: సంక్రాంతికి వెళుతుండగా విషాద ఘటన
వరంగల్: హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షలో ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతసాగర్‌లో దీప్తి రాథోడ్ అనే విద్యార్దిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం విద్యార్థిని ఎస్ఆర్ యూనివర్శిటీలో అగ్రికల్చరల్ బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది.
కాలేజీకి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు పండుగకు ఇంటికి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఈ క్రమంలో అందరూ ఇంటికి వెళ్తుండగా దీప్తి ఇంకా బయటకు రాలేదని శుక్రవారం ఉదయం ఆమె కోసం స్నేహితురాళ్లు ఆమె గదికి వెళ్లారు. గదిలో ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే వారు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్ధలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో విద్యార్ధిని ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురై చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం దీప్తి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార‌్చురీకి తరలించినట్లు వెల్లడించారు. రాథోడ్ మరణంతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చలి మంటలతో వృద్ధుడు మృతి
చలిమంట కాగుతుండగా నిప్పంటుకుని ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మారెడ్డిపల్లికి చెందిన బొల్లి లచ్చయ్య(60) కొద్ది సంవత్సరాల కిందట పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యారు. డిసెంబర్ 30న రాత్రి చలి అధికంగా ఉండటంతో కుటుంబసభ్యులు చలిమంట వేసి దగ్గర్లో లచ్చయ్యను కూర్చోబెట్టారు. ఈ సమయంలోనే ఆయన లుంగీకి మంటలు అంటుకుని కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.












Click it and Unblock the Notifications