ఆన్‌లైన్ మోసం: 12 లక్షలు పోగొట్టుకుని టెక్కీ ఆత్మహత్య, సోదరి పెళ్లి ఉండగా విషాదం
హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతుండటంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అటు సైబర్ క్రైం పోలీసులు, ఇటు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఎక్కడో ఓ చోట మోసపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మోసపోయాడు. తన సోదరి వివాహం కోసం దాచిన 12 లక్షలు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డిలో ఉంటున్న అరవింద్(30) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొంత కాలం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. మడు నెలల క్రితమే అతనికి వివాహమైంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో ఈ ఆన్‌లైన్ మోసం అంతా మార్చేసింది. తనకు టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్ లింక్‌ను ఓపెన్ చేసి చూస్తే.. ఆన్‌లైన్‌లో డబ్బులు ఇన్వెస్ట్ గురించి ఉంది. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు.

అరవింద్ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఆన్‌లైన్‌లో కొన్ని డబ్బులను బెట్టింగ్ పెట్టాడు. ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేయడంతో అతను పెట్టిన రూ. 200కు బదులుగా 250 పంపించారు సైబర్ నేరగాళ్లు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి.. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే రూ. 12 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అంతేగాక, ఇచ్చిన టాస్క్ లను కూడా పూర్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి డబ్బు అతనికి తిరిగి రాలేదు. అటునుంచి ఎలాంటి స్పందన కూడా లేదు.
మరోవైపు, మే 5వ తేదీన అరవింద్ చెల్లి పెళ్లి ఉంది. ఇంట్లో ఖర్చుల కోసం ఉంచిన డబ్బులనే అరవింద్ ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు. ఉన్న అప్పులు తీర్చలేక.. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బును తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అరవింద్. అతడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు నెలల క్రితమే అరవింద్‌ను వివాహం చేసుకున్న అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.












Click it and Unblock the Notifications