Tiger: కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి సంచారం..!
తెలంగాణలో పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవుల్లో పులి తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. పులి పెద్దగా గాండ్రిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై అటవీ శాఖను వివరణ కోరగా.. పాద ముద్రలు గుర్తించామని పేర్కొన్నారు. అయితే ఆ పాదముద్రలు పులివా కావా అనేది స్పష్టంగా తెలియలేదని తెలిపారు.
అటవీ శాఖ అధికారులు పులి కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. 15 రోజుల క్రితం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. కాగజ్‌నగర్ మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ పత్తి ఏరడానికి చేనుకు వెళ్లింది. ఆమె పత్తి ఏరుతున్న సమయంలో వెనక నుంచి పెద్ద పులి వచ్చి దాడి చేసింది. వెంటనే ఆమె కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ దాడిలో లక్ష్మి తలకు తీవ్ర గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 20 రోజుల క్రితం మంచిర్యాల జిల్లాల్లో రెండు పులులు ప్రవేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకటి మహారాష్ట్ర అడవిల్లోకి తిరిగి వెళ్లిపోయింది. కానీ మరో పులి మాత్రం ఇక్కడే ఉండిపోయినట్లు తెలిసింది. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చారు.
12 రోజుల క్రితం మంచిర్యాల జిల్లాల బెల్లంపల్లి మండలంలో శివారు అటవీ ప్రాంత గ్రామం చర్లపల్లిలో చిరుతపులి సంచరించింది. చుట్టు పక్కాల గ్రామాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో పులులు, చిరుత పులుల సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications