విషాదం: భవనంపై నుంచి దూకి మహిళా న్యాయవాది ఆత్మహత్య, లొంగిపోయిన భర్త
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్‌లో ఓ మహిళా న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం తెల్లవారుజామున మహిళా న్యాయవాది శివాని భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా న్యాయవాది ఆత్మహత్య.. స్టేషన్లో లొంగిపోయిన భర్త
ఐదేళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తితో శివానికి వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున శివాని ఆత్మహత్య చేసుకున్న అనంతరం ఆమె భర్త అర్జున్ చందానగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదాలే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
శివాని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మహిళా న్యాయవాది ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే శివాని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.

బాలికను అపహరించి, పెళ్లి చేసుకున్న రౌడీ షీటర్ అరెస్ట్
ఓ బాలికను అపహరించి, వివాహం చేసుకున్న రౌడీషీటర్‌ను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ పుకట్ నగర్‌కు చెందిన కమల్ సింగ్ అలియాస్ డల్లా(25) కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు.
కాగా, ప్రేమిస్తున్నానని వెంటపడి ఏప్రిల్ 12న 17ఏళ్ల బాలికను అపహరించి, నగర శివారులోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కమల్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

చర్లపల్లి జైలుకు మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్ ఖతిక్
మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ ఉమేష్ గులాభాయి ఖతిక్(26)ను పేట్ బషీర్‌బాద్ పోలీసులు గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి ఏప్రిల్ 13న చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడ్ని 10 రోజుల పోలీస్ క్టసడీ కోరుతూ మేడ్చల్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కు చెందిన ఉమేష్ ఖతిక్ జనవరి 18న నాంపల్లిలో ఓ హోటల్‌లో బస చేశాడు.
టోలిచౌకిలో స్కూటీని అపహరించి 19వ తేదీన నగరంలో ఐదు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడు గుజరాత్ చేరినట్లు గుర్తించారు. కాగా, అప్పటికే అహ్మదాబాద్ పోలీసులు ఓ పాత కేసులో అరెస్ట్ చేసి సబర్మతి జైలుకు రిమాండ్ తరలించినట్లు తెలిసింది. హైదరాబాద్ లో దోచిన బంగారు నగలు అక్కడే పడేసినట్లు అహ్మదాబాద్ పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ప్రస్తుతం నిందితుడ్ని తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications