విషాదం: పెళ్లంటే భయంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: పెళ్లిపై భయం పెంచుకున్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేటలోని చైతన్యబస్తీలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు ఆ యువతికి పెళ్లి సంబంధంధాలు చూస్తున్న క్రమంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యబస్తీలో ఉండే ఝాన్సీ(25) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ఝాన్సీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, చుట్టుపక్కల ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలు చూసిన ఝాన్సీ.. పెళ్లిపై భయం, విరక్తి పెంచుకుంది.

తాను పెళ్లి చేసుకోనని కుటుంబసభ్యులకు ఝాన్సీ తెగేసి చెప్పేసింది. అయినా ఆమెకు సంబంధాలు చూడటం ఆపలేదు కుటుంబసభ్యులు. దీంతో తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేస్తారని భయపడిపోయింది. ఈ క్రమంలో తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్య
ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఉరేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నంకి చెందిన పూజ చైతన్యపురిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో జవహర్‌నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్‌తో పరిచయడం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
అయితే, పూజ, దయాకర్ ప్రేమ విషయం కాస్తా దయాకర్ తల్లికి తెలియడంతో ఆమె పిలిచి.. ఇద్దరినీ మందలించింది. అంతటి ఆగకుండా దయాకర్ తల్లి పూజ తల్లిదండ్రులను కూడా బెదిరించింది. ఈ క్రమంలో దయాకర్.. తన ఇంటికి పూజని తీసుకెళ్లాడు. దీంతో దయాకర్‌కి అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన పూజ.. ఓ గదిలోకి పరిగెత్తుకుని వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దయాకర్‌తో పాటు అతని తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్టు చేస్తున్నట్లు జవహార్ నగర్ పోలీసులు వెల్లడించారు. యువతి ఆత్మహత్యతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications