కేటీఆర్ కు బిగిస్తున్న ఉచ్చు - ఏసీబీ కేసులో కీలక పరిణామం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల పైన జరిగిన విచారణలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే కేసులో హరీష్, ఎంపీ ఈటల తమ వివరణ ఇచ్చారు. ఇక, ఇప్పుడు కేటీఆర్ పైన నమోదైన ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న ఏసీబీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. వరుసగా కేసీఆర్ కుటుంబం విచారణలు ఎదుర్కోవటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో సారి నోటీసులు జారీ చేసింది. 16వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. గతంలోనే కేటీఆర్ ఒక విడత విచారణకు హాజరయ్యారు. ఉత్కంఠత నడుమ విచారణ కు వెళ్లిన కేటీఆర్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగానే ఫార్ములా ఈ రేసు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. నగదు లావాదేవీల విషయంలోనే ఏసీబీ కేటీఆర్ నుంచి సమాచారం సేకరించింది.

అదే విధంగా ఈ కేసులో నాడు క్రియా శీలకంగా వ్యవహరించిన అధికారులను ఏసీబీ విచారణ చేసింది. రెండో విడత విచారణ కోసం మే 28న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికాలో జరగనున్న బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు వెళ్లాల్సి ఉన్నందును తను హాజరు కాలేనని ఆయన తేల్చి చెప్పారు. కాగా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఈ సారి విచారణకు హాజరవుతారా.. మినహాయింపు కోరుతారా అనేది కీలకంగా మారుతోంది. అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విచారణలకు హాజరు కావటం రాజకీయంగా బీఆర్ఎస్ లో చర్చగా మారింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications