ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి: ఇంట్లో నోట్ల గుట్టలు
నిజామాబాద్: రాష్ట్రంలో మరో అవినీతి అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడటంతో ఏసీబీ అధికారులు కూడా షాకయ్యారు. దీంతో సోదాలు కొనసాగిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు దాసరి నరేందర్. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రోజంతా సోదాలు చేయగా.. ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించారు.

దాసరి నరేందర్ తోపాటు అతని బంధువుల ఇళ్ల్లోనూ ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయలు నగదు బయటపడింది. ఈ నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. ఇక, నరేందర్ బ్యాంక్ ఖాతాలో కోటి 10 లక్షల రూపాయలు గుర్తించారు. ఇంట్లోని బీరువాల్లో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన 17 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ సోదాలు.. కోట్ల రూపాయల నగదు స్వాధీనం
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2024
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది.. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
ఇంట్లో… pic.twitter.com/2IUipZKnbv
ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించడంతో నరేందర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏసీబీ అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడటం ఇప్పుడు సంచనలంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, సోదాలు దాదాపు పూర్తయిన తర్వాత దాసరి నరేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిపారు. సుమారు రూ. 40 కోట్ల వరకు ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications