పద్మ అవార్డుల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు
దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులపై సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రాముడికి భారతరత్న అవార్డు రావాల్సిందేనని స్పష్టం చేశారు. తన తల్లి, నిర్మాత విజయనిర్మలకు కూడా పద్మ పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్మ అవార్డుల కోసం అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేసినా తప్పులేదని కుండబద్దలు కొట్టారు.
తన జన్మదినం సందర్భంగా ఆదివారం మీడియాతో నరేశ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందిస్తూ.. పద్మ అవార్డులపై కూడా మాట్లాడారు. తెలుగు వారికి పద్మ పురస్కారాలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం, విజయ నిర్మలకు పద్మ అవార్డు లభించాలన కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అని వివరించారు. తన తల్లికి అవార్డు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు.. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు నరేశ్ సంచలన ప్రకటన చేశారు.

ఈ అవార్డుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవార్డుల కోసం సిఫారసు చేసినట్లు నటుడు వీకే నరేశ్ గుర్తుచేశారు. విజయ నిర్మలకు అవార్డు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అవార్డులకు అర్హత కలిగి ఉన్నారని నరేశ్ తెలిపారు. తెలుగు వారికి అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని చెప్పారు. తాను 2025లో మొత్తం 9 సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో విజయ నిర్మల జయంతి.. జంధ్యాల కార్యక్రమాలు చేస్తున్నట్లు నటుడు నరేశ్ తెలిపారు. ప్రతిభ కలిగిన వారిని సినీ పరిశ్రమలో ప్రోత్సహిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications