నేనేమీ తప్పు చేయలేదు..అలాంటప్పుడు ఎందుకు భయపడాలి?: సమంత
హైదరాబాద్: టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి సమంత నటించిన కొత్త మూవీ శాకుంతలం. ఏప్రిల్ 14వ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకుడు. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడారు. అనేక విషయాలను బయటపెట్టారు. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తరువాత సినిమాల మీదే దృష్టి పెట్టిన సమంత- వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చర్చనీయాంశమౌతోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంపైనా స్పందించారామె. ఈ విషయంలో తాను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను కేరీర్ లో ఎప్పుడు కూడా ఐటెమ్ సాంగ్ చేయలేదని గుర్తు చేశారు. పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా.. పాట సాహిత్యం తనకు నచ్చిందని, అందువల్లే వద్దని చెప్పినా తాను ఆ పాటలో నటించానని వివరించారు. ఒక మంచి సినిమాలో నటిస్తోన్నప్పుడు, పైగా ఓ గొప్ప డ్యాన్సర్ అల్లు అర్జున్‌తో కలిసి డాన్స్ చేసే అవకాశం తనకు రావడాన్ని వదులుకోలేకపోయానని అన్నారు.

నాగచైతన్యతో దాదాపుగా విడిపోతున్న సమయంలో ఈ పాటలో నటించే ఆఫర్ తనకు వచ్చిందని సమంత పేర్కొన్నారు. తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇంట్లో వాళ్లు.. అభ్యంతరం పెట్టారని అన్నారు. విడాకులు తీసుకుంటున్నానని అప్పటికే అందరికీ తెలిసిందని, అలాంటప్పుడు ఐటమ్ సాంగ్ చేయకూడదంటూ ఆంక్షలు పెట్టారని సమంత వివరించారు. తనను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు కూడా.. ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించలేదని అన్నారు.

వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి తాను వంద శాతం ప్రయత్నించానని, దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయని సమంత పేర్కొన్నారు. తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, అలాంటప్పుడు తాను ఎందుకు భయపడాలని చెప్పారు. నాకు నేనుగా ఎందుకు శిక్షించుకోవాలని ప్రశ్నించారు. ఊ అంటావా పాటలోని లిరిక్స్ నచ్చాయని సమంత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దాన్ని తాను ఐటమ్ సాంగ్ గా భావించట్లేదని, ఓ కొత్త ప్రయత్నం చేసినట్లనిపించిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications