చీప్ లిక్కర్.. రాయల్ కిక్కు: రూ.25 వేల మద్యం 8 వేలకే!
హైదరాబాద్ శివార్లలో వినూత్న రీతిలో మద్యం కల్తీ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా ఆటకట్టించారు రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. బడాబాబులు నిర్వహించే లిక్కర్ పార్టీలు, ఈవెంట్లలో ఖరీదైన విదేశీ మద్యం సీసాలను సేకరించి వాటిలో తక్కువ ధర కలిగిన చీప్ లిక్కర్‌ను నింపి విక్రయిస్తున్న ముఠాను రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్సై అఖిల్ బృందం పట్టుకుంది. ఈ ముఠా నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన మిక్సింగ్ మద్యం, ఖాళీ సీసాలు, మూతలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాలో ఒడిశాకు చెందిన లాలూప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు లిక్కర్ ఈవెంట్లలో పని చేస్తూ ఖరీదైన మద్యం సీసాలను సేకరించేవారు. వీరికి కరీంనగర్‌కు చెందిన శరత్ చంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తోడయ్యాడు. శరత్ చంద్ర అత్తాపూర్‌లో నివాసం ఉంటుండగా.. వీరంతా కలిసి కొండాపూర్ ప్రాంతంలోని గుట్టల బేగంపేటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ అత్యంత ఖరీదైన రాయల్ సెల్యూట్, శివాస్ రీగల్ వంటి బాటిళ్లలో ఐకాన్ లాంటి తక్కువ ధర మద్యం, కొద్దిపాటి నీరు కలిపి రీ-ప్యాకింగ్ చేసేవారు.

ఈ ముఠా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా తమ వ్యాపారాన్ని సాగించేవారు. మార్కెట్లో రూ.25,100 ధర పలికే రాయల్ సెల్యూట్ బాటిల్‌ను కేవలం రూ. 8,000లకే విక్రయించేవారు. అలాగే రూ.9,090 ఖరీదైన శివాస్ రీగల్‌ను రూ. 4,000లకు, రూ. 7,190 ఖరీదైన గ్లాండ్ విచ్ బాటిల్‌ను రూ. 3,000లకే శరత్ చంద్ర ద్వారా ఇతర సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమ్మేవారు. తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం వస్తుందని ఆశపడిన వారు ఈ కల్తీ మద్యాన్ని కొనుగోలు చేసి మోసపోయేవారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి, లాలూ ప్రసాద్ బిస్వాల్, శరత్ చంద్రలను అరెస్ట్ చేసి కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 3 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఖరీదైన మద్యం తక్కువ ధరకే వస్తుందని నమ్మి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేయవద్దని.. ఇలాంటి అక్రమ విక్రయాలను ఎవరూ ప్రోత్సహించవద్దని రంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ ప్రజలను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications