తెలంగాణ నుంచి అయోధ్య, వారణాసి టూర్.. తక్కువ ధరకే.. TGSRTC ప్యాకేజీ
అయోధ్య, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అంత దూరం ఎలా వెళ్లాలో తెలియక చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి TGSRTC బస్సులో అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. త్వరలోనే ఈ పుణ్య క్షేత్రాలకు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అయోధ్య, వారణాసికి టూర్ ప్యాకేజీల సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
టీజీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తాజాగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దీంతో త్వరలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, తదితర టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సజ్జనార్ ఆదేశాలతో అధికారులు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈ టూర్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
టీజీఎస్ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్‌లకు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. సామాజిక బాధ్యతగా వినూత్న ఆలోచనతో ఇటీవల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్యతను వివరించడంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు.
వ్యక్తుల ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు యాత్రదానంలో భాగంగా తీసుకెళ్లేందుకు డిపోల వారిగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు వస్తుండటం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గడపకు టీజీఎస్ఆర్టీసీ సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ అనే కార్యక్రమానికి మే 2023లో సంస్థ శ్రీకారం చుట్టింది. వీరు ఆర్టీసీ కల్పిస్తోన్న వివిధ రకాల సేవలను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామస్థులు, కాలనీవాసులతో నిత్యం టచ్‌లో ఉంటూ.. 15 రోజులకోసారి వారితో సమావేశమవుతున్నారు.

బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తూ.. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను సేకరించి.. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్ ట్రిప్పులను పెంచాలని అధికారులకు చెప్తున్నారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని ప్రజలకు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications