Loan Waiver: రుణ మాఫీపై కీలక అప్డేట్.. ఎప్పుడు మాఫీ చేస్తారంటే..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది. ఇందులో రైతు భరోసా, రూ.2 లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్. అయితే ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర సర్కార్ అమలు చేయడం లేదు. పాత పద్ధతిలోనే రైతు బంధు జమ చేస్తున్నారు. అయితే రైతు భరోసా, రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ఎప్పుడిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
తాజాగా రైతు రుణ మాఫీపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.రుణ మాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని.. ఆ రుణాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని గుర్తు చేశారు. విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. వెంటనే రైతు రుణ మాఫీ చేయడంతో పాటు వరికి రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అయితే క్రాఫ్ లోన్ రెన్యూవల్ చేసుకుంటే ఇబ్బంది ఏం ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతు రుణ మాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. త్వరలోనే రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు రాగానే రైతు రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ చివరి నాటికి రైతు బంధు నిధుల జమ పూర్తి చేస్తామని చెప్పారు.
రైతులు వరికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్ బోనస్ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలున్న నేపథ్యంలో రైతు రుణ మాఫీ సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం రైతు రుణ మాఫీ జరిగే అవకాశం ఉంది. అయితే రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. రెన్యూవల్ చేయకపోవడంతో వడ్డీకి వడ్డీ పడి అప్పు పెరుగుతోంది.












Click it and Unblock the Notifications