తెలంగాణ శాసనమండలిలో అనూహ్య పరిణామం: ఎకాఎకిన ఎమ్మెల్సీపై వేటు వేసిన పార్టీ
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్సీపై వేటు పడింది. తక్షణమే తన సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ పార్టీ అధిష్ఠానం ఆయనను ఆదేశించింది. పార్టీ నుంచి కూడా ఆయనను బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించింది. ఆయనతో ఎటువంటి సంబంధాలు ఉండవనీ తేల్చి చెప్పింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి కూడా.
అఖిల భారత మజ్లిస్- ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. దీనితో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న శాసన మండలి సభ్యత్వానికి కూడా తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్ ఎ హుస్సేన్ అన్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

రహమత్ బేగ్ తన రాజీనామా పత్రాన్ని వెంటనే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని హుస్సేన్ అన్వర్ ఆదేశించారు. ఇంత హఠాత్తుగా ఆయనపై బహిష్కరణ వేటు వేయడానికి, సభ్యత్వానికి రాజీనామా చేయమని కోరడానికి గల నిర్దుష్ట కారణాలను మజ్లిస్ కేంద్ర కార్యాలయం వెల్లడించలేదు.
దీని వెనుక ఓ వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు వెలువడటానికి ఒక రోజు ముందు.. రహమత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు దాఖలు చేశారు. గుర్తుతెలియని కొందరు దుండగులు డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామంటూ తనను బ్లాక్‌మెయిల్ చేస్తోన్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. నిత్యం ఫోన్ లలో బెదిరిస్తోన్నారని, పెద్ద ఎత్తున నగదు డిమాండ్ చేస్తున్నారని ఆయన పోలీసులకు వివరించారు.
అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ డీప్ ఫేక్ వీడియోలను బహిర్గతం చేస్తామని, కుటుంబ ప్రతిష్ట, రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తామని హెచ్చరించినట్లు రహమత్ బేగ్ స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. పోలీసులకు ఈ ఫిర్యాదు అందిన 24 గంటల తర్వాత రహమత్ బేగ్ పై ఏఐఎంఐఎం బహిష్కరణ వేటు వేయడం, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రహమత్ బేగ్.. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే, ఆ స్థానం ఖాళీ అవుతుంది. దీనివల్ల చట్టసభల నిబంధనల ప్రకారం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications