హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభం, ఈ సిటీలకు కూడా
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా హైదరాబాద్ నుంచి అయోధ్య తోపాటు పలు నగరాలకు విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ అయోధ్య సహా ఏడు నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్తగా రాజ్ కోట్, అగర్తాల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ - అయోధ్య, హైదరాబాద్ - కాన్పూర్ మధ్య వారానికి 4 రోజుల సర్వీసును ప్రారంభించారు. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు సర్వీసులు నడుస్తాయి. సెప్టెంబర్ 28 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్, హైదరాబాద్ నుంచి ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించున్నారు.

జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత మూడు నెలల విరామం అనంతరం ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్ మధ్య రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 16న ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అగర్తాల మధ్య వారానికి 4 రోజులు సెప్టెంబర్ 23న, హైదరాబాద్ నుంచి జమ్మూ మధ్య వారానికి మూడు రోజులు సెప్టెంబర్ 24న ప్రారంభించారు.
హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే ఏడు నూతన సర్వీసులను ప్రారంభించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్ ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications