నేడే విస్తరణ, కొత్త మంత్రులు వీరే - డిప్యూటీగా ఎస్టీ నేత.. ఆయన కోసం రేవంత్ పట్టు..!!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నేడు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి ముగ్గురికే విస్తరణ పరిమితం చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ముగ్గురు పేర్లను పార్టీ ఖరారు చేసింది. కాగా, మరో ఇద్దరి పేర్ల పైన రేవంత్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, తొలి నుంచి రేసులో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ సారి ఛాన్స్ లేనట్లే. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
కొత్త మంత్రులుగా
సుదీర్ఘ నిరీక్షణ తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. హైకమాండ్ తో సుదీర్ఘ మంతనాల అనంతరం నేడు విస్తరణ.. కొత్త మంత్రుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం 12.19 గంటలకు విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్ ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు.

డిప్యూటీగా ఎస్టీ నేత
మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. కాగా, బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ పట్టుబడుతున్నట్లు తెలు స్తోంది. ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచందర్‌నాయక్ పేర్ల పైన చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఎస్టీ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందు కోసం రాం చందర్ నాయక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తుది జాబితాలో మార్పులు లేకుంటే ఈ ముగ్గురే ఫైనల్ గా మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చివరి నిమిషంలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో.. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఈ సారి ఛాన్స్ దక్కలేదు. అదే విధంగా రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాలకు సైతం ఈ సారి విస్తరణలో దాదాపు అవకాశం లేదని తెలుస్తోంది. కాగా, క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. వివేక్ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా.. ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే. వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. తనను కలిసిన కొందరు నేతలకు ఈ రోజు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. సుదర్శన్ రెడ్డి పేరు పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు నెలల్లోనే పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, ఈ ముగ్గురికే విస్తరణ పరిమితం చేయటం ద్వారా పార్టీలో ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications