ఏపీ గుత్తేదారుకేనా?: రేవంత్ సర్కారుపై మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణలోని రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. పట్టపగలే దోచుకుంటున్నారని ఆరోపించారు. చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దొంగలు పోయి, గజదొంగలు వచ్చినట్లుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
అమృత్ నిధులకు సంబంధించి అవినీతి టెండర్లను రద్దు చేసి, గ్లోబల్ టెండర్లను పిలవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు తెలియకుండా దొంగ జీవోలు జారీ చేస్తున్నారని రేవంత్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పనులన్నీ ఏపీ గుత్తేదారులకు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా అంటూ నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతి చీకటి ఒప్పందాలతో అవినీతి మయం అయ్యిందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. జవాబుదారీతనం, పారదర్శకత లేని ప్రభుత్వం నడుస్తుందన్నారు. ప్రజా దర్బార్ కానరాకుండా పోయిందని విమర్శించారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మేఘ కృష్ణారెడ్డిని జైలుకు పంపిస్తామన్నారని.. అదే మేఘకు ఇప్పుడు 40 శాతం ఎక్కువతో టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. కేంద్ర అమృత్ నిధులు గ్లోబల్ టెండర్లు లేకుండా ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30 శాతం తక్కువకు చేసేందుకు కంపెనీలు ముందుకి వస్తాయన్నారు.
గ్లోబల్ టెండర్లు చేయకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సిద్దం అవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో అవినీతి టెండర్లు రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. టెండర్లలో రూ.12 వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications