తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఢిల్లీ పిలుపు: లిక్కర్ స్కాంతోపాటు రాజకీయాలపై చర్చ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ నేతలకు రేపు అంటే మంగళవారం ఢిల్లీ రావాలంటూ సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. రాష్ట్ర నేతలతో జాతీయ స్థాయి నేతలు ఎప్పటికప్పుడు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఢిల్లీ పిలుపు
తాజాగా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ నేతలకు రేపు అంటే మంగళవారం ఢిల్లీ రావాలంటూ సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం నాటికి ఢిల్లీకి రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో వారు సమావేశం కానున్నారు.

ఢిల్లీకి కిషన్ రెడ్డి, బండి సహా కీలక నేతలు
ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కే లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్, జాతయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధకర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతోపాటు తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా వారితో చర్చించనున్నారు.

యూపీ వ్యూహం తెలంగాణలో అమలు
ఎన్నికలకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించేందుకు పక్కా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికిల్లా.. కేంద్రం నుంచి తెలంగాణలో వరుస పర్యటనలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం ఫలించడంతో తెలంగాణలోనూ అదే ప్లాన్ అమలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. కాగా, పాదయాత్రతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్లగా.. తాజాగా, ప్రజా గోస-బీజేపీ భరోసా లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కార్నర్ సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications