అమిత్ షా తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే: ఖమ్మంలో 15న భారీ బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కూడా తమ కసరత్తులను ముమ్మరం చేస్తోంది. పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు, బహిరంగ సభలను ప్లాన్ చేస్తోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాలికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలసుకున్నారు. ఇప్పుడు మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో మరోసారి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 15న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఖమ్మంలో ఈ నెల 15న బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా జేడీ కన్వెన్షన్‌కు చేరుకుని 11.15 నుంచి 12.45 వరకు టిఫిన్ పే చర్చలో పాల్గొంటారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలంకు పయనమవుతారు.భద్రాచలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అదే సాయంత్రం 4.50 నుంచి 5.50 వరకు ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభ ముగించుకుని సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు బయల్దేరతారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకుని.. అక్కడే పార్టీ నేతలు, మేధావులతో వేర్వేరుగా సమావేశమవుతారు.
ఆ తర్వాత రాష్ట్ర పర్యటనను ముగించుకుని రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, అమిత్ షా హాజరయ్యే ఖమ్మం సభను రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు లక్ష మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. ఖమ్మంలో బీజేపీకి బలం లేదంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఈ సభతో కౌంటర్ ఇవ్వాలని ఫిక్సయ్యారు.












Click it and Unblock the Notifications