తెలంగాణలో 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ!
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఇదే చివరి డీఎస్సీ కాదు, మరిన్ని తెస్తామన్నారు. త్వరలో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని తెలిపారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని తెలిపారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. 19,717న మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీలు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు, జులై 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంచామని, ఇప్పటికే 2,00,500 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. డీఎస్సీకి అభ్యర్థులు కొన్ని నెలలుగా సిద్ధం అవుతున్నారని, అందుకే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యనందించాలని డీఎస్సీ ప్రకటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డ డిప్యూటీ సీఎం.. పదేళ్లు డీఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదన్నారు.
గ్రూప్-2ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారు. తమ ప్రభుత్వం నిర్వహించడానికి కృషి చేస్తోంది. పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని డిప్యటీ సీఎం భట్టి వివరించారు.












Click it and Unblock the Notifications