కేంద్రమంత్రికి మళ్ళీ షాక్.. మళ్ళీ మీటింగ్ అనుమతి నిరాకరణ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారటంతో అందరూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ముఖ్య నాయకులు జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇక బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కు మరో షాక్ తగిలింది.
బండి సంజయ్ సభలకు అనుమతి ఇవ్వని పోలీసులు
తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఆయన సభలకు అనుమతులు నిరాకరించడంతో బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న బోరబండ సభకు అనుమతి లేదని బండి సంజయ్ ను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ బోరబండ సభ నిర్వహించిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పైన మండిపడ్డారు. ఈ మీటింగ్ లో ఆయన చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు.

రహమత్ నగర్ సభకు బండి సంజయ్ కు అనుమతి నిరాకరణ
ముఖ్యంగా కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా నేడు రహమత్ నగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రహమత్ నగర్ లో మీటింగ్ నిర్వహించుకోవడానికి మాజీమంత్రి కేటీఆర్ కు అనుమతి ఇచ్చిన పోలీసులు, కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదని సమాచారమిచ్చారు.
పోలీసుల తీరుపై బండి సంజయ్ మండిపాటు
దీంతో పోలీసులు తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు చెప్పడమేంటని మండిపడ్డారు. ఈనెల 4న అప్లై చేసుకుంటే.... ఇప్పటిదాకా నాన్చడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించిన బండిసంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ విమర్శలు గుప్పించారు. అందుకే బీఆర్ఎస్ సభలకు పర్మిషన్ ఇస్తున్నారన్నారు.
కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్న కేంద్రమంత్రి
మా సభలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి సభలకు పర్మిషన్ ఇస్తే ఒక వర్గం ఓట్లు పోతాయని భయం కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications