సికింద్రాబాద్-అయోధ్య ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలో హాల్ట్: ఆ స్టేషన్లు ఇవే
Secunderabad-Ayodhya express: తెలగు రాష్ట్రాల్లో రెండో విడత భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కింది. సికింద్రాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య, వారణాశికి బయలుదేరి వెళ్లింది. శనివారం రాత్రి ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరిచారు. వాటి ట్రిప్‌ల సంఖ్యనూ పెంచుతోన్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి అయోధ్య, వారణాశికి రెండో ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కే పద్మజ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భారత్ గౌరవ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఇది 24వ సర్వీసు. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్రగా దీనికి నామకరణం చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ ట్రిప్ కొనసాగుతుంది. గయ, వారణాశి, అయోధ్య, ప్రయాగ్ రాజ్‌లను ప్రయాణికులు సందర్శించవచ్చు.
తెలంగాణలో భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, పెందుర్తి, విజయనగరం స్టేషన్లల్లో భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్యను మరింత పెంచేలా అధికారులు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. మున్ముందు విజయవాడ/విశాఖపట్నం నుంచీ ఆయా పుణ్యక్షేత్రాలకు ఈ రైల్ కనెక్టివిటీని కల్పించే దిశగా చర్యలు తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications