4 వేల కోట్ల స్కాంలో ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ? బీజేపీ ఆరోపణలు.. !
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ఇవాళ భూకుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్న 4 వేల కోట్ల భూముల్ని తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ ధారాదత్తం చేశారని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు.
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు హాఫిజ్ పేటలోని సర్వే నెంబర్ 78 లో వున్న 40 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి సర్కార్ అనుమతి మంజూరు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ భూమి విలువ 400 కోట్ల రూపాయలని రఘునందన్ తెలిపారు. ఇదే సర్వే నెంబర్ లో ఎంబిఎస్ జువెలర్స్ సుఖేష్ కు చెందిన 8 ఎకరాల భూమిని విక్రయించేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతివ్వడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యవహారాన్ని ఈ సందర్భంగా రఘునందన్ గుర్తుచేశారు.

తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య సంస్థ హఫీజ్ పేటలోని 40 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతించడాన్ని రఘునందన్ తప్పుబట్టారు. ఇదే సర్వే నంబర్లోని ఎంబీఎస్ జ్యూయలర్స్ సుఖేష్ గుప్తాకు చెందిన 8 ఎకరాల భూమి అమ్ముకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారని, ఇప్పుడు తోట చంద్రశేఖర్ విషయంలోనూ కలెక్టర్ అలా ఎందుకు సవాల్ చేయడం లేదని రఘునందన్ ప్రశ్నించారు. రేపు ఖమ్మం లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఖర్చంతా తోట చంద్ర శేఖర్ పెడుతున్నాడని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications