కెటిఆర్‌ను కలిసిన ఏపీ వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్, వరంగల్లో గెలిస్తే: కిషన్ రెడ్డి ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం కలిశారు. వారి భేటీ చర్చనీయాంశమైంది.
కెటిఆర్‌తో భేటీ అనంతరం శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తాను కేవలం వ్యక్తి గత పని విషయమై కలిశానని తెలిపారు. అంతకుముందు నిర్మాత సురేష్ బాబు మంత్రి కెటిఆర్‌ను కలిశారు.
అనంతరం సురేష్ బాబు మాట్లాడిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ పైరసీలో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పైరసీని అరికట్టేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రైవసీ నిర్మూలనకు కొత్త పాలసీని తీసుకొస్తామని సర్కార్ చెప్పిందన్నారు. కెటిఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ చర్చోపచర్చలు
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన అనంతరం ప్రకటించాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలకు సూచించారు.
బిజెపి అభ్యర్థి గెలిస్తే కేంద్రమంత్రి పదవి: కిషన్ రెడ్డి
ఉద్యమాల పునాదుల పైన పార్టీని నిర్మించానని, తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పాలకపక్షం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని, ప్రభుత్వానికి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయమన్నారు.
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రమంత్రి పదవి లభిస్తుందన్నారు. టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగానే ఈ బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. అభ్యర్థి ఖరారు విషయంలో తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. వరంగల్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్‌కు రెఫరెండం అన్నారు.












Click it and Unblock the Notifications