టీఎస్పీఎస్సీని మూసివేసే ఆలోచన ఉందా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఛైర్మన్, సభ్యులను నియమించాలని సూచించింది. ఛైర్మన్, సభ్యులను నియమించకుంటే టీఎస్పీఎస్సీని మూసేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని నియమించిన తర్వాత నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
జే శంకర్ అనే నిరుద్యోగి దాఖలు చేసిన పిల్‌పై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. పూర్తిస్థాయి కమిషన్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పని సాధ్యం కావడం లేదని, ఛైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగేలా హైకోర్టు చొరవ తీసుకోవాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. కాగా, పబ్లిక్ కమిషన్‌లో ఒక్కరు మాత్రమే ఉండటం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

టీఎస్ పీఎస్సీని మూసేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అని నిలదీసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ముఖ్యమైనదని, ఛైర్మన్, సభ్యులను నియమించకపోతే.. దాన్ని మూసేయాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వెంటనే కమిషన్ సభ్యుల నియమాలు చేపడతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. కాగా, పిల్‌పై తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
డ్రగ్స్ కేసులో సర్కారుకు హైకోర్టు ప్రశ్నలు
డ్రగ్స్ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై గురువారం విచారణ జరిపింది. 2016 నాటి కేసులు సీబీఐ, ఈడీకి ఇవ్వడం లేదంటూ లాయర్ రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసు వివరాలను తమకు ఇవ్వడం లేదంటూ ఈడీ తెలిపింది. ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. ఈ క్రమంలో ఈడీకి ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో నిందితులను దాచిపెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. డ్రగ్స్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోంది? అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.












Click it and Unblock the Notifications