వరదొచ్చిందని ఇంటికి తాళం వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!!
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల వారికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో ఇది దొంగలకు వరంగా మారి చోరీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్, వరంగల్ నగరాలు ముఖ్యంగా ముంపుకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా వరద పరిస్థితులతో చాలా మంది ఇళ్లలోకి నీరు రావటంతో పునరావాస కేంద్రాలకు వెళ్ళారు.

నగరంలో గతంలో ఎన్నడు లేని విధంగా వందకు పైగా కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంలో మొత్తం 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి సహాయం అందిస్తున్నారు. ఇక హైదరాబాద్లోనూ అనేక ప్రాంతాలలో వరద ముంపు రావడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
దీంతో ముంపు ప్రాంతాలలో జనాలు లేకపోవడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు. ఈ సమయంలో ఎవరు ఎవరి ఇంటికి వెళ్లి చోరీ చేసినా అర్ధం కాదని, పట్టపగలు కూడా చోరీలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.ఎవరైనా ఏమైనా వస్తువులు తీసుకువెళ్ళినా సదరు కుటుంబ సభ్యులే పంపి ఉంటారన్న భావన కలుగుతుందని దొంగలను గుర్తించటం కష్టంగా మారుతుందని అంటున్నారు.
గత సంవత్సరం ఎల్బీనగర్, నాగోలు, గాజులరామారం ప్రాంతాలను వరద గుంపుకు గురైన సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసుకొని దొంగతనాలు జరిగాయి. కనుక వరదల దెబ్బకు ఇళ్ళలో ఉండలేక ఇళ్ళకు తాళం వేసి వెళుతున్న వారు ఇంటి నుండి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను, డబ్బులను వెంట తీసుకుని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచితే అవి దొంగల పాలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications