తెలంగాణ నెంబర్ వన్, గుజరాత్‌ను దాటేసింది: కేసీఆర్‌తో జైట్లీ
న్యూఢిల్లీ: అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతోందని, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. తెలంగాణ తర్వాతనే గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయని ఆయన అన్నారు.
పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డితో కలిసి కేసీఆర్ గురువారంనాడు అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఎయిమ్స్‌కు వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని జైట్లీ కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

కేసీఆర్ విజ్ఞప్తి
దంత చికిత్స కోసం వారం రోజులుగా ఢిల్లీలో ఉన్న కేసీఆర్ గురువారం జైట్లీతో అర గంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్ర రెవెన్యూ 18 శాతానికి పెరిగినందున ప్రస్తుతం ఉన్న 3.5 శాతం ఎప్ఆర్‌బిఎంను పరిమితిని కొనసాగించాలని కేసీఆర్ కోరారు.

విభజన హామీలపై...
విభజన హామీలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తీర్చాలని కేసీఆర్ జైట్లీని కోరాు. ఎయిమ్స్, ఐఐఎం వంటి వాటిని మంజూరు చేయాలని కోరారు. ఎయిమ్స్‌కు అవసరమైన స్థలాన్ని ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి ఐఐఎం ఇస్తామని అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని ఇచ్చిన హామీని గుర్తు చేశారు దానికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని సిఎం చెప్పారు

ఇప్పటికీ నిధులు అందలేదు...
విభజన చట్టం మేరకు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా కూడా ఇంకా రాలేదని కేసీఆర్ జైట్లీ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని 10 జిల్లాలో 9 జిల్లాలకు ఆర్థిక సాయం అందాల్సి ఉంది. దాంతో కేంద్రం మూడేళ్లుగా వాటికి ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది.

అధికారులకు జైట్లీ ఆదేశాలు..
వెంటనే నిధులను విడుదల చేయాలని అరుణ్ జైట్లీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిఎం కేసీఆర్ వెంట అరుణ్ జైట్లీని కలిసినవారిలో ఎంపి జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఆర్థిక శాక ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications