ఐదు రోజులు, ఐదు వర్ణాలు: వెంకయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: భారతదేశంలో మరే రాజకీయ నేత, మరే ముఖ్యమంత్రి తలపెట్టని రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైభవంగా ఆయుత చండీయగాన్ని నిర్వహిస్తున్నారు. యాగకర్త కేసీఆర్, రుత్విక్కులు సహా యాగశాలలోని ప్రతి ఒక్కరూ దీక్షా దుస్తులను ధరిస్తున్నారు.
చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తెలుపు రంగు దీక్షా దుస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు యాగశాలలో ఉన్న రుత్విక్కులు ధరించారు. ఎంతో శ్రద్ధగా నియమ నిష్టలతో యాగం చేయాలన్న శాస్త్ర ప్రమాణం ఆధారంగానే దీక్షా దుస్తులను ధరిస్తున్నారని పండితులు చెబుతున్నారు.
ఏ యాగంలోనైనా రుత్విక్కులు ఒకటి లేదా రెండు రకాల దీక్షా వస్త్రాలను ధరిస్తారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో మాత్రం ఐదు రోజుల పాటు ఐదు వర్ణాలు కలిగిన దుస్తులను ధరిస్తున్నారు. మూడో రోజైన ఈరోజు తెలుపు రంగు, నాలుగో రోజు ఎరుపు, ఐదో రోజు మళ్లీ పసుపు వర్ణంతో కూడిన దీక్షా వస్త్రాలను ధరించనున్నట్లు చండీయాగాన్ని నిర్వహిస్తున్న రుత్విక్కులు తెలిపారు.

కాగా, వాస్తవానికి, యాగాన్ని నిర్వహించే రుత్విక్కులు, యాగకర్తకు మాత్రమే దీక్షా వస్త్రాలు ఇవ్వడం యాగ సంప్రదాయం. కానీ, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ యాగంలో అందుకు భిన్నంగా యాగాన్ని పర్యవేక్షించే అధికారిక సిబ్బంది, రుత్విక బాధ్యతల్లో లేని మరికొందరు, ఐఏఎస్‌లు, ఐపీఏస్‌లు, రాజకీయ నాయకులు, యాగాన్ని సందర్శించే పలువురు ప్రముఖులకు కూడా దీక్షా వస్త్రాలను ఇవ్వడంపై కొందరు వేదపండితులు ఆక్షేపిస్తున్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి రెండో రోజు దీక్షా వస్త్రాలను ధరించి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వీరిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమ గుండంలో హోమ ద్రవ్యాలతోపాటు పట్టుచీరను కూడా వేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యకు కాస్త హారతి కర్పూరం ఇవ్వడంతో దానిని కూడా వేశారు. దాంతో హోమాగ్ని ఒక్కసారిగా ఝుమ్మంటూ పైకి వచ్చింది. వెంటనే, వెంకయ్య, కేసీఆర్ తదితరులు ఒక్క అడుగు వెనక్కి వేశారు. దీంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications