21 ఏళ్లకే సర్పంచులుగా ఈ మహిళామణులు..
యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామంగానే ఉంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం వారికి చిన్నవయసులోనే కలుగుతుంది. తాజాగా తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యువతీయువకుల హవా కొనసాగుతోంది. ఓటర్ల మద్దతుతో చిన్న వయసులోనే సర్పంచ్ లుగా ఎన్నికవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన ఓ యువతి 21 ఏళ్లకే సర్పంచ్ గా ఎన్నికయ్యారు. బీటెక్ పూర్తి చేసిన ఆ యువతి క్యాంపస్ కొలువును సైతం వదులుకొని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మరో ఘటనలో 21 ఏళ్లకే మరో యువతి సర్పంచ్ గా విజయం సాధించారు. కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన ఆ యువతికి గ్రామ ఓటర్లు పట్టం కట్టారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష.. బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుని ప్రజా సేవ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలా ఇస్లాం నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 21 ఏళ్లకే సర్పంచ్ గా గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనూష.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 182 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

మరో ఘటనలో.. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో 21 ఏళ్లకే సర్పంచ్ గా జంగా శివాని విజయం సాధించారు. తాండ్రియాల గ్రామానికి చెందిన జంగా శివాని.. ఇటీవలే డిగ్రీ పూర్తి చేశారు. భర్త సపోర్ట్ తో సర్పంచ్ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులతో పోటీలో నిలిచి విజయం సాధించారు. ఇక రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. డిసెంబర్ 17 బుధవారం రోజున పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మూడో విడతలో భాగంగా 182 మండలాలు, 4,157 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఇక మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.












Click it and Unblock the Notifications