తెలంగాణలో దారుణం.. మటన్ వండలేదని భార్యను కిరాతకంగా చంపిన భర్త
ప్రస్తుతం జరుగుతున్న పలు సంఘటనలను పరిశీలిస్తే.. క్షణికావేశంలో మనుషులు మృగాళ్ల లాగా మారిపోతున్నారని అర్దం అవుతోంది. ఆవేశంలో జరిగే ఘటనలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. చెప్పింది చేయలేదని, మద్యానికి డబ్బులు ఇవ్వట్లేదని, అడిగిన వస్తువు కొనివ్వట్లేదని, అనుమానంతో.. ఇలా పలు రకాల ఇష్యూ లతో చంపేస్తున్నారు. అయితే ఈ తరహా ఘటన మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
మొన్న ఈ మధ్య కూరలో నల్లిబొక్క వేయలేదనే కారణంతో హత్య చేస్తే.. ఇప్పుడు అసలు మటన్ కూర వండలేదనే కారణంతో భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు ఓ భర్త. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సిరోల్ మండలం మంజా తండాకు చెందిన మాలోత్ బాలు.. తన భార్య కళావతిని దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలు, కళావతి ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఇంట్లో భార్య మటన్ కూర వండలేదని బాలు గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి గొడవ పెద్దది అయ్యి.. ఆవేశం తట్టుకోలేక బాలు తన భార్యను దారుణంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఈ మేరకు కళావతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.
మరోవైపు రీసెంట్ గానే పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని ఓ తండ్రి మద్యం మత్తులో విచక్షణరహితంగా తీవ్రంగా కొట్టడంతో... ఆ బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకుంది. ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు, నాగమణికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భానుప్రసాద్ చదివే పాఠశాలలో ఫేర్ వెల్ ఫంక్షన్ నిర్వహించారు. దీంతో అతను రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సైదులు అప్పటికే మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
అయితే అసలు విషయం తెలుసుకోకుండానే బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీ, ఇతర భాగాలపై పిడిగుద్దులు గుద్దడం, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం వద్దని వైద్యులకు చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే బాలుడి మృతదేహాన్ని ఆరెగూడెంకు తరలించారు. పోలీసులకు తెలిస్తే సైదులుపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతారని భావించి మృతదేహాన్ని దహనం చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందడంతో స్మశాన వాటికకు చేరుకొని అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications