Free Bus: మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆందోళనలో ఆటో డ్రైవర్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తోంది. మొదటగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఉచిత బస్ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
తమకు బస్ ఛార్జీలు లేకుండా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు హైదరాబాద్ లో అయితే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడంతో చాలా మంది మహిళలు బస్సులు ఎక్కడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లు, ఆటోలు ఎక్కేవారు తక్కువ అయ్యారు.

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంతో తమ బతుకు దెరువు దెబ్బ తింటుందని ఆవేదన చెందుతున్నారు. తాము కుటుంబంతో రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు ఆటో యూనియన్ నేతలు శనివారం హైదరాబాద్ లో సమావేశం కానున్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మెట్రో రైళ్లలో కూడా రద్దీ తగ్గింది. సోమవారం నుంచి బస్సుల్లో భారీగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది.












Click it and Unblock the Notifications