కౌన్సెలింగ్: నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ కంటతడి
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ సోమవారం నాడు కంటతడి పెట్టారు. హైదరాబాదులోని గోషామహల్ ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇనిస్ట్రిట్యూట్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి బాబూ మోహన్‌చే కౌన్సెలింగ్ ఇప్పించారు.
కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట చనిపోయిన తన పెద్ద కొడుకు పవన్ కుమార్‌ను గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కంటతడి పెట్టారు.
తాగడం తప్పు కాదని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పని చెప్పారు. కుటుంబాలను అనాథలను చేయవద్దని బాబు మోహన్ కోరారు. తాగి చనిపోతే పరువు పోతుందని, అందుకే ప్రమాదాల బారిన పడవద్దని ఆయన వారికి సూచించారు.

నిజాంలా కెసిఆర్ తీరు: శ్రవణ్
తెలంగాణ జలమండలిలో అవినీతిపై తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలిలో కోట్ల అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. జలమండలి ఎండీ జగదీష్ అవినీతికి తెరలేపారని, అవినీతిని సహించనన్న సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
తక్షణమే జలమండలి ఎండీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు.

ఇసుక మాఫియాపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ
మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నదిలో ఇసుక తోడటంపై 27 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇష్టారీతిన ఇసుక తోడకం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ హైకోర్టులో హాజరయ్యారు. కౌంటర్ దాఖలులో ఇసుక మాఫియా పేర్లు లేవంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితుల వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది.
ఇసుక మాఫియా వెనుక ఉన్న నాయకులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తాము కేసులు నమోదు చేశామని, విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని పిటిషన్ వాయిదా వేసింది.
పోలవరం నిర్వాసితులకు పరిహారంపై పిల్
పోలవరం నిర్వాసితులకు పరిహారంపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. 2013 పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సమగ్ర వివరాలతో 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పోలవరం అథారిటీ, కేంద్రానికి కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications