నోట్ల రద్దుపై సుప్రీంకు, అక్రమార్కుల కన్ను.. బంగారం రూ.40వేలు?
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు పైన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంగమ్ లాల్ పాండే అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయం ప్రజలకు తీవ్ర ఇబ్బంది, ఇక్కట్లు సృష్టించిందని ఆ పిల్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, ఇదే విషయమై పైన బాంబే హైకోర్టులో మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా సంగమ్ లాల్ పాండే చెప్పిన సమస్యలే దాదాపు ప్రస్తావించారు. కాగా, మంగళవారం రాత్రి నుండి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగారం తులం రూ.40 వేలు?
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం పోగేసిన అక్రమార్కులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ నోట్లు చిత్తు కాగితాలే అని ప్రధాని మోడీయే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న నల్లధనంతో కొందరు అక్రమంగా బంగారం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ సహా నగరంలోని పలుచోట్ల ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, అక్రమార్కులు మరో రకంగా ఆలోచిస్తున్నారు. తమ వద్ద ఎంత అక్రమార్జన ఉంటే వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్కడికక్కడ వదిలించుకునేందుకు చూస్తున్నారు. ఇందుకు బంగారం వ్యాపారులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛమైన పసిడి 10 గ్రా. సుమారు 31,000 ఉండగా, రూ.40,000 చెల్లించి కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించడానికి వారు సిద్ధపడుతుండడంతో కొందరు వర్తకులు సైతం వారికి తగినట్లుగా రేటు పెంచేసి బంగారం అమ్ముతున్నారట.












Click it and Unblock the Notifications